Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

కళ - సంస్కృతి

లోకమున ఉత్తమభావనలు పెంపొందవలెను.

వృక్షములు అనుకూలములగు వానలు పడు సుక్షేత్రములలో చాలా ప్రోదిగను, దృఢముగను, దట్టముగను పెరుగును, ఆర్ద్రత ఎక్కువగుకొద్ది వృద్ధియును అధికము. వృద్ధి అధికమగుకొద్ది ఉత్తమభావనలు జనించుచునే యుండును. ఒక్కొక్క దేశమునను మహానీయులు జన్మించి తరుచు మంచి విషయములనుగూర్చి బోధించుచున్నయెడల ఆ దేశపు నాగరికతయు, కళాచారమును (కల్చర్‌) గొప్పగా నుండును.

కల్‌ (అరవము) కళ, కాలేజీ, కళాచారము ఇవన్నియు ఒకేపదమునుండి పుట్టినవి. ఫ్రెంచిభాషలో 'కాలే' యని యందురు. కాని దీనికి మూలము 'కలా' యనునదియే. కళ యనగా వృద్ధి లెక్కించుట. దినదిన ప్రవర్థమానమగునది చంద్రకళలవలె.

ఒక్కొక్క దేశమునందును- అందలి జనుల ఉత్తమ భావనలు స్వార్థ త్యాగము, ఇతరులయందు ప్రేమానురాగములు, శాంతస్వభావము. అందరు సుఖసౌఖ్యములుగా నుండవలెననెడి కోరికలు - ఆ దేశము సంస్కృతిని సూచించును. నాట్యము, సంగీతము, చిత్రము, కవనము మొదలగునవి - ఇట్టి ఉన్నతభావముల మూర్తులే; రూపములే, ఆ విశాల భావనలే చిత్రరూపముగను, నాట్యరూపముగను, సంగీతరూపముగను, దాన త్యాగములుగను పరిణామము చెందుచున్నవి.

సంస్కృతిగలమానవుడు సమస్తజనానీకమునకు మిత్రుడు. అతనికి విరోధులెవ్వరును లేరు. అతనిలో 'స్వదేశో భువనత్రయమ్‌' అన్నభావన రూఢియైయుండును. అతని హృదయ వైశాల్యము, ఎల్లరిని తన అనురాగపు హద్దులలోనికి తీసుకొని వచ్చు ఇచ్ఛకల్గినదై యుండును. మనకు ఉన్నదంతయు ఊరి వారికి చేరబెట్టిన సంస్కృతిగలమానవుడు సమస్తజనానీకమునకు మిత్రుడు. అతనికి రోధులెవ్వరును లేరు. అతనిలో 'స్వదేశో భువనత్రయమ్‌' అన్న భావన రూఢియైయుండును. అతని హృదయ మనగతియేమిటి? అన్న ప్రశ్న అతని భావనా కాశమున ఏనాడునూ పొడసూపదు. అదియే తని సంస్కృతి.

ఒకనికి సంస్కృతి యున్నదా లేదా యనుటకు అతని మనోభావనల వైశాల్యము మనము గుర్తించవలెను. దేహమున ఎన్ని వ్రణములున్నను వైద్యుడు హృదయమును పరీక్షించి అతడు రోగియా కాదాయని తీర్మానించును, అటులనే ఒక దేశపు సంస్కృతి యొక్క ఔన్నత్యమునకు కొలబద్ద ఆ దేశములోని మహనీయుల భావనలు, ఉద్దేశ్యములు, ఆచారములును, అవి ఆ దేశపు మహాకవుల వాగ్ధారలో వ్యక్తమగును.

కవు లన్న పలురకములు, ఒక సంవత్సరములో నూరుగురు కవులు పుట్టి నూరుగురును మరగిపోవుదురు. కొందరి వ్రాతలు వారితోడనే మరగిపోవును. కొందరు కీర్తిగాని ద్రవ్యమునుగాని ఆశించక బృహత్కావ్యములను వ్రాసి యొకమూల నుంచుదురు. వానికై పలువురు తహతహలాడుచు వెదుక సాగుదురు. ఆభాష తెలియనివారు కనీసము తర్జుమాచేసియైన అందలి సారమును గ్రహించుటకు ఉత్కంఠితు లగుదురు. మరియొకతెగ కవులు కావ్యములు వ్రాసి వాసి ముద్రణార్థము చందాలకై ప్రతి గుమ్మమును ఎక్కి సతమత మగుదురు. అచ్చుఅయిన అలాటి పుస్తకములు అమ్ముడుపోక వారి యింటియందే స్థిరనివాస ముండును. నిజమైన యోగ్యతగల కావ్యములు అన్వేషింపబడును. మహాకవుల వాక్యములకు ఉపేక్షాదోష మెన్నటికిని ఉండదు. పాశ్చాత్య కవులలో హోమరు. షేక్స్పియరు అను ఇరువురు కవులు ఈ తరగతికి చెందినవారు.

మతప్రవక్తలలో సైతము కవు లుండవచ్చును. కాని వారికి తమసిద్ధాంతముల నిలబెట్టుకొనవలెననెడి వాంఛ బలీయముగా నుండుటనే వారికవనములు ఆ సిద్ధాంతముల ననుసరించుచుండును. కాని మహాకవులు ఘంటాఘోషముగా ఉన్న దున్నట్లు మంచియో, చెడ్డయో తమకు తోచినది స్వేచ్ఛగా పలుకుదురు. వారివర్ణనలు, వాక్కులు యథాతథములు. మహాకవి స్వేచ్ఛాజీవియై తాను చూచినది. తనకు తోచినది, అందమైనది, మనోజ్ఞమైనది అంతయుగ్రంథస్థముచేయును. లోకము వానిని గ్రహించిన అతనికి సంతోషముకానీ, నిరాకరించిన దుఃఖముకానీ లేదు. ఏ బాధ్యత విచారములేక ఉన్నదున్నట్లు చెప్పుట అతనికి పరిపాటి. అందుచేత మతప్రవక్తలు సైతము వారి సిద్ధాంత నిరూపణకై మహాకవుల వాక్యముల నుదాహరించుట యొక ఆచారము.

దాదాపు వేయి సంవత్సరముల క్రితము కుమారిలభట్టు అను వారొకరుండిరి. ఉదయనాచార్యులనువారు మరొక మహాపురుషుడు. చాలమంది - ఆదిశంకరులు బౌద్ధమతమును మనదేశమునుండి వెళ్ళగొట్టిరని అభిప్రాయపడుదురు. ఇది సరికాదు. ఆదిశంకరులు బౌద్ధమును ఉండుమనిగానీ, వెళ్లుమనిగాని చెప్పలేదు. ఈ సత్యమును ఆయనపేరు పెట్టుకొన్న నేనే చెప్పుచున్నాను. చిత్రములందును, శిల్పములందును బౌద్ధ స్వరూపము లుండుటవల్ల దేశమున బౌద్ధమత బాహుళ్య ముండినదని అభిప్రాయమేర్పడి యుండవచ్చును. ఆచార్యుల శాస్త్రగ్రంథములను గానీ, వారిపిదప వచ్చిన ఆచార్యుల గ్రంథములనుగానీ, మనము పరిశీలించిన బౌద్ధమతఖండనచాలా స్వల్పము. వారందరు సాంఖ్య మీమాంసా తత్త్వములనే శోధించి వానిని అంగీకరింప వీలులేదని వ్రాసిరి.

బౌద్ధమతమున చేరినవారు. అధికులు బిక్షవులే. గృహస్థులలో బౌద్ధమతమునకు చెందినవారు చాలాకొద్ది. ప్రస్తుతపు థియసాఫికల్‌ సొసైటికి చెందినవారు అనేకులున్నారు. కానీ వారిగృహములకు వెళ్ళి చూచిన వారి సంప్రదాయమంతయు వైదికమతము ననుసరించియుండును. ఒక మహనీయుడు జన్మించిన అతనిపైగల ఆదరాభిమానములచేత - ఆయన చెప్పిన విషయములలో శ్రద్ధచూపి యుండవచ్చును. అంతమాత్రమున ఆయనమతములో పూర్తిగా కలిసినట్టుగాదు. అటులనే ఆ కాలమున రాజులు, గృహస్థులు బౌద్ధమతమున అభిమానముంచిరే కాని, బౌద్ధమతసాంప్రదాయములను వారి నిత్యజీవితములోనికి తీసికొనిరాలేదు. భిక్షువులుమాత్రము పరిపూర్ణ బౌద్ధులు.

కాని బౌద్ధమును విస్తారముగా ఖండన మొనర్చినది ఉదయనాచార్యులును, కుమారిలభట్టును, ఉత్తరబీహారములోని మిథిలానగరవాసులు ఉదయనాచార్యులు. వీరు న్యాయ మీమాంసమును పాటించెడివారు. కుమారిలభట్టునకు వేద శాస్త్రములలోని కర్మానుష్ఠానములే ప్రమాణము. అందుచే ''బుద్ధుడు జ్ఞాని కావచ్చును. ఆమాత్రమున ఆయన చెప్పినది సార్వకాలికము కానేరదు. ప్రపంచము పుట్టినప్పటినుండి వచ్చెడి వేదవాక్యములే మనకు ప్రమాణము. రాతితో కట్టిన కట్టడము క్రిందపడవచ్చును. శిలామండపములును శిథిలము కావచ్చును. కాని మహాపర్వతములకు నాశనమనునది లేదు. వాని ఘనతను వాని స్థిరత్వమే తెలుపును. ఇక వేదములో శైలముకంటె శాశ్వతములయిన పవనాకాశముల వంటివి. అందులోని కర్మానుష్ఠానములే మనకు ప్రమాణము. కార్యా కార్యవివక్షకు మనము వేదములనే పాటించవలెను.'' అని బౌద్ధులవాదనను వీరు ఖండించిరి.

ధర్మము, ధర్మము అనగానేమి? దాని భూమిక ఎట్టిది? మన ధర్మములను రాచచట్టములు నిర్థారించును. చట్టములను చేయునవి శాసనసభలు. ఈ సభ్యుల నందరను మనమే ఎన్ను కొందము. ఈ ఎన్నుకొనబడినవా రందరూ యోగ్యతకల వారేనా? వారు సరియైన మార్గముననే వోట్లను బడసిరా ? ప్రజలలో అందరకును వోట్లహక్కుగలదు. దొంగకు, దొరకు, మోసగానికి, నిరక్షరాస్యునికి - అందరకును సమానమైన వోటింగుహక్కుగలదు. ప్రజాప్రభుత్వమున ఇన్ని దొసగులు తెలిసియే మనము అంగీకరించుచున్నాము. మెజారిటి సభ్యులు ప్రభుత్వమును నడుపుదురు. చట్టములను చేయుదురు. కొన్ని సందర్భములలో చట్టము చొప్పున చేయబడిన న్యాయస్థానపు తీర్పులలో న్యాయము కనుపించదు. అందు న్యాయాధిపతులు తీర్పు చెప్పుచు చట్టముల మార్చవలసిన అవసరమున్నదని తమ అభిప్రాయములను ప్రభుత్వమునకు తెలుపుదురు.

ఆత్మార్థముగా కార్యాకార్యవిచక్షణ దేనిననుసరించి నిర్ణయించవలెను? 'వేదో7ఖిలో ధర్మమూలమ్‌' అను సూత్రమున్నది. అన్ని ధర్మములకు మూలము వేదములే. అది అనాదిగ నున్నది. అవి సార్వకాలికమును, సనాతనమును. ''నాడు చెప్పునదిఏమైనా వేదవాక్యమాఏమి?'' యను పరిహాసముగా అనెడు మాట వేదముల ఆధిక్యమును సూచించును.

వేదానుసారము నడచుకొందమన్న వేదము లమితవిస్తారములు. అనంతా వై వేదాః' అని అందురు. సామవేదమునకు వేయిశాఖలు. యజుర్వేదమునకు 101 శాఖలు, ఋగ్వేదమునకు 21, అధర్వణవేదమునకు 11 శాఖలునుగలవు. వేదములను పూర్తిగా చదివినవారుగూడ అరుదు. అటులైనచో మనవర్తన వేదబద్ధముగా నుండవలయునన్న ఎవరిసలహా తీసికొనుట?

వేదములను చక్కగా చదివిన మహం్షులు స్మృతులను ఏర్పరచియున్నారు. వానిని చూడనగును.

'వేదో7ఖిలో ధర్మమూలమ్‌ తద్విదాం చ స్మృతిశీలే'

-గౌతమ ధర్మసూత్రము.

మనుస్మృతి, పరాశరస్మృతి అనునవి మహం్షులు సంకలితము చేసిన గ్రంథములు. అవి వేదధర్మములను బోధించును. అయినచో ఇవి నిజముగా వేదములలో చెప్పబడిన ధర్మములను తు.చ. తప్పకుండ తెల్పునా? లేక మహం్షుల సొంత అభిప్రాయములు మత్రమే ఈ స్మృతులలో వ్రాయబడినవా? అనెడు సందేహముకలుగవచ్చును. సందేహనివృత్తికి మనము ఆధారములను వెదుకవలెను. ఈ ఆధారములు మనకు మహాకవుల వాక్యములనుండియే దొరకవలెను.

రఘువంశమున వశిష్ఠాశ్రమమున దిలీపమహారాజునందినీ సేవచేయు సందర్భమునుగూర్చి కాళిదాసు ఒక శ్లోకము వ్రాసెను. దిలీపుడు అనపత్యుడు. అనపత్యాదోష నివారణార్థము కులగురువగు వశిష్ఠుని అతడు ఆశ్రయించును. వశిష్ఠుడు దిలీపునికి నందినిని చూపి దీనికి భక్తిశ్రధ్ధలతో సేవచేసినచో దోషమువాసి పుత్రుని బడయుదువని చెప్పెను? ఆనాటినుండి మహారాజు పసులకాపరి అయెను. ధనుర్బాణధారియై ఆయన నందినివెంట వెళ్లును. అది నిలుచున్న తానును నిలుచుండును. అది పడుకొన్న తానును పడుకొనును. దానివెంట ఆయన ఛాయవలె వెంబడించెను.

స్థితః స్థితా ముచ్చలితః ప్రయాతాం

నిషేదుషీ మానవబంధ ధీరః,

జలాభిలాషీ జల మాదదానాం

ఛాయేవ తాం భూపతి రన్వగచ్ఛత్‌||

దిలీపుడు వసిష్ఠుని ఆశ్రమమునుండి నందినిని తోలుకొని వెళ్లునపుడు సహధర్మచారిణి సుదక్షిణ - కొంచెము దూరము నందిని వెంటవెళ్ళి అటుపై తిరిగి వచ్చెడిదట, దీనిని కాళిదాసు అతిసుందరముగా వర్ణించును. నందిని ముందు వెళ్ళును. సుదక్షిణ అటు ఇటు చూడక నందిని అడుగుజాడలయందే నడచును. నందిని గిట్టలనుండి ధూళి ఎగసెడిది. ఆ ధూళి ననుసరించియే సుదక్షిణ వెళ్ళెడిదట.

తస్యాః ఖుర న్యాసపవిత్రపాంను

మపాంసులానాం ధురి కీర్తనీయా,

మార్గం మనుష్యేశ్వరధర్మపత్నీ

శ్రుతే రివార్థం స్మృతి రన్వగచ్ఛత్‌||

పాంసువు అనగా ధూళి, (ఖురవిన్యాసమున) అడుగులు వేయుటవలన, (పవిత్రపాంసువు) పవిత్రమైన ధూళి పై కెగయుచున్నది. 'అపాంసులానాం ధురి కీర్తనీయా' ్స కొంచెమైనను మాలిన్యములేనిది, ధూసరితముకానిది, కళంకములేని ఉత్తమ స్త్రీమనుష్యేశ్వర ధర్మపత్నియగు సుదక్షిణాదేవి - నందినీఖుర విన్యాస పవిత్రపాంసువులను చూచుకొనుచు, నందిని అడుగుల వెంట చనును. ఆ వెంటాడుట- శ్రుతులను అనుసరించి హహం్షులు చేసిన స్మృతుల పోలికగా ఉన్నదట. 'శ్రుతేరివార్థం స్మృతిరస్వగచ్ఛత్‌'్స ఇచట నందినియే శ్రుతి, సుదక్షిణ స్మృతి. సుదక్షిణ పూర్తిగా నందినివెంట పోలేదు. కొంచెము దూరము పోయినది. అటులనే వేదములందు చెప్పబడిన దంతము స్మృతులయందు చెప్పబడలేదు. అవి స్మృతిమాత్రములే. మహం్షులకు జ్ఞపకమున్నంతవరకువారి సతిమ్మేరకు వ్రాయబడినవి. కాని సుదక్షిణ నందిని అడుగుజాడలలో నడచినట్లే స్మృతులును వేదముల అడుగుజాలలోనే నడచినవి.

అందుచే స్మృతులు వేదములే. మహం్షుల సొంత కల్పనలుకావు. అందుచేతనే మనము ధర్మమునకు స్మృతులను చూడవలెను. స్మృతులు సహితము అర్థముకావు. అది అందుబాటులో లేదు. మరి ధర్మము తెలిసికొనుటకు ఎవరిని ఆశ్రయించవలెనన్న ప్రశ్న ఉదయించినయెడల వేదములు చక్కగా తెలిసినవారు ఏఏ సందర్భములలో ఎట్లు నడచుకొనుచున్నారో దానిని పరిశీలించి - వారి శీలముప్రకారము నీ శీలమును దిద్దుకొమ్ము - అని సమాధానము.

కాని నాకు వేదములు తెలియవు. స్మృతులు అంతకుముందే తెలియవు. వేదానుసారము నడచెడివారి శీలమును నాకు అర్థము అగుటలేదు. మరి నాసందేహ నివారణకుమార్గమెట్లు? అనినచో - 'ఆత్మనః తుష్టిః' ్స ఈశ్వరుని స్మరించి నీ మనస్సాక్షి ప్రకారము నడచుకొమ్ము - అని పెద్దలందురు.

ఇట్లు మొదటి ప్రమాణము వేదము. తరువాత స్మృతి. అటుపై 'తద్విదాం శీలమ్‌'్స వేదమును తెలిసినవారి శీలమును అనుసరించి, అదియు తెలియకపోయిన 'ఆచారస్తుసాధూనాం' సాధువుల వర్తనము ననుసరించి, కడపటిది 'ఆత్మనః తుష్టిః' మనస్సాక్షికి దోచినట్లు నడచుకొనుట. కాని యిపుడు అన్నిటి వలెనే ఇదియు తలక్రిందయినది. మొదటి ప్రమాణము మనస్సాక్షియే. 'వేదము లెవరు వ్రాసిపెట్టిరి? అవి ఏమి చెప్పునో తెలియదు. మనస్సాక్షిప్రకారము నడచుకొందును' - అనెడు కాలముగా తయారయినది. కాన శాస్త్రరీత్యా మనస్సాక్షి కడపటి ప్రమాణము.

కాళిదాసుచే వ్రాయబడిన శాకుంతలమందు - దుష్యంతుడు కణ్వాశ్రమమున ప్రవేశించి అందు శకుంతలను గాంచును. అపు డతనికి దానిని వివాహమాడ నిచ్చ ఉదయించెను. 'ఇది ధర్మమా? నేను క్షత్రియుడను. ఈకన్యాశ్రమనివాసిని. నాకిట్టి దురాలోచన ఎన్నడును కలుగలేదే. నే డెందుల కీ తలంపు. నా మనసెందులకు ఈ కన్యపై ప్రియపడుచున్నది? ఇది ఈశ్వర సంకల్పమా?' అని అతడు ముందువెనుకలాడి తన అంతఃకరణము చెప్పినరీతి నడచుకొన నిశ్చయించెను.

అనంశయం క్షత్త్రపరిగ్రహక్షమా

య దార్య మస్యా మభిలాభి మే మనః,

నతాం హి సందేహపదేషు వస్తుషు

ప్రమాణ మంతఃకరణప్రవృత్తయః||

అని కాళిదాసు వ్రాయును.

కుమారిలభట్టు ఈవాక్యమును - 'ఆత్మనః తుష్టిః' అనుదానికి - ప్రమాణముగా గ్రహించెను. విశిష్టాద్వైతధర్మములనుగూర్చి చెప్పునపుడు - వేదాంతదేశికులు - 'కవిచక్రవర్తి కాళిదాసు ఇట్లు చెప్పెను'- అని వ్రాసెను. ఇట్లు ఒక దేశపు సంస్కృతిని సూచించుటకు ఒక మహాకవి వాక్యముచాలును. అదియే ప్రమాణమగును. మహాకవి యనుటకు నిదర్శనము - అతని గ్రంథములు కాలగర్భమున విస్మృతములుకాక చిరంజీవములై యుండుటయే. అట్టి గ్రంథరాజమే కాళిదాసు శాకుంతలము.

సాధారణముగా మన మతమును గూర్చి ఇతరులు చర్చించునపుడు, మీ మతములో ఎంతమంది దేవుళ్ళు? ఎన్ని కొబ్బరికాయలు కొట్టుదురు? ఎన్ని దీపాలు వెల్గింతురు? ఒక్కస్వామి చాలడా? యని పరిహాసము చేయుదురు. ఇట్లు అనేక ఉపాసనమూర్తులను కలిగియుండుటను 'సోతిథీయిజం' అని అందురు. ఒకే దేవుని కొలుచుటకు మానోథీయిజం' అనిపేరు. ఈ కొత్తమతములు వచ్చుటకు ముందు అన్ని మతములందును నానాదైవములుండిరి. ఉన్నదైవములందరిని పారద్రోలి దేవుడొక్కడేయన్న ఒక మతమును మహమ్మదు అరేబియాలో లేవదీసెను. గ్రీసుదేశమునను ఇటులనే యుండగా క్రీస్తుఅనంతరము ఒక్క దేవుని పూజించుట ఆరంభమయినది. అటులయినచో మనదేశముననున్న ఇంతమంది దేవుళ్ళనుగూర్చి మహాకవు లేమయిన చెప్పిరాయను విషయమును గమనింపదగును.

కాళిదాసువలెనే బాణుడను కవి సంస్కృతమున మహా కవి. ఒక విధముగా కాళిదాసుకంటె ఇత డధికుడనియే చెప్పవలెను. 'బాణోచ్ఛిష్టం జగ త్సర్వం' అనెడు సూక్తి యొకటి వాడుకలో నున్నది. మిగతకవులు చెప్పునది అంతయు బాణుడు చెప్పగా వదలినది. - అతని ఉచ్చిష్టమే అని దీనిభావము.

ఈ విధముననే కాళిదాసు గూర్చిన ప్రశంసావాక్యములెన్నో యున్నవి.

ఉపమా కాళిదాసస్య భారవే రర్థగౌరవం

దండినః పదలాలిత్యం మాఘే నంతి త్రయో గుణాః||

అని చెప్పుదురు. పైగా మన వ్రేళ్ళలో చిటికెనవ్రేలు (కనిష్టము) నకు ముందున్న వ్రేలు అనామిక అని యందురు. ఒకప్పుడు మహాకవులను లెక్కవేయుటలో కాళిదాసు ఒకటి యని చిటికెనవ్రేలితో లెక్కించి అటుపై ఎవరును తోచకపోగా అంతటితో ఆగిపోయిరట. అందుచే అనామకమైనదట రెండవవ్రేలు.

పురా కవీనాం గణనాప్రసంగే

కనిష్ఠికాధిష్ఠితకాళిదాసః,

అద్యాపి తత్తుల్యకవే రభావాత్‌

అనామికా సార్థవతీ బభూవ||

బాణుడు ఇటులు వ్రాయును:-

రజోజుషే జన్మని సత్త్వవృత్తయే

స్థితౌ ప్రజానాం ప్రలయే తమస్పృశే,

అజాయ నర్గస్థితినాశ##హేతవే

త్రయూమయాయ త్రిగుణాత్మనే నమః||

బ్రహ్మ, విష్ణు, శివులు నిజమునకు ఒక్కడే, కాని మూడుకార్యముల నుద్దేశించి సృష్టిస్థితిసంహారార్థము- మూడు రూపములనుదాల్చి రజస్సత్త్వతిమోగుణములకు ప్రతినిధులగుదురు. త్రయీమయ- ఋగ్యజుస్సామవేదములం దుపదేశింప బడిన వస్తువు ఇదేయని బాణమహాకవి జెప్పును.

కాళిదాసుకూడ ఇదేవిధముగ చెప్పును:-

ఏకైవ మూర్తి ర్భిభిదే త్రిధా సా

సామాన్యమేనం ప్రథమాపరత్వమ్‌,

విషోర్హర స్తస్య హరిః కదాచిత్‌

వేదా స్తయో స్తా వపిధాతు రాద్యౌ||

ఒక్కమూర్తి మువ్వురుగ దోచును వీనిలో హెచ్చు తక్కువ లేవియునులేవు. ఇట్లు చూచిన హిందూమతములోని ముప్పదిమూడుకోట్ల దేవతలకును మూలమూర్తి యొక్కడే, అయినచో ఈ వివాదము లెందులకు? దేవుళ్ళలో ఉచ్చ నైచ్యములకు ఎడమేది? ఒక వంతెనక్రిందనిలిచి చూచిన మన మున్న విభాగము (వంతెన కన్ను ్స ిఠ| శస-ఠ ుౌ షఠ| శిసdగ| n ూఠ-ఠ ూ| షశnd) తక్కినవానికంటె పెద్దదిగా కనబడును. కానీ నిజమునకు అవి సమాన పరిమాణము కలవి. భక్తునికి తాను కొలుచు దైవమందు భక్తి ప్రేమలు అధికముగా నుండుటచే తాను కొలుచు దైవము అధికుడన్న భావన ఉదయించును. కాని నిజమునకు అన్ని దైవములును మూలపరతత్త్వముయొక్క సమానచ్ఛాయలే.

ప్రపంచములో సమస్త వస్తువులకు మూలము దేవుడు. బీజముయొక్కవృద్ధి - భూసారము, జలము ఈ మొదలగువానిని బట్టియుండును. మట్టిలో పుట్టిన వృక్షము అంతిమదశలో జీర్ణించి మట్టిలోనే కలియును. ఇది వృక్షపు జీవితచరిత్ర. తక్కిన జడ వస్తువులు చేతనములు, అచేతనములు - అన్నియూ యీ తెరగే. వృక్షమునకు ఆధారము మన్ను. మట్టికి ఆధారము పృథివి. అటులే మనచైతన్యములకంతయు నొకమూలచైతన్యముండవలెను. అదియే చిత్‌; చిదానందము. అదియే రజస్సత్త్వ తమోగుణ సంబంధముచే సృష్టి స్థితి లయముల నొనర్చును. అందుచేతనే దేవుని త్రిగుణాత్మకుడని యందురు.

కేవలము నిర్గుణమగు చిత్‌ స్వరూపము-పరబ్రహ్మము. శుద్ధసత్త్వపరబ్రహ్మమే గుణములతో కూడిన ఈశ్వరుడగును. సృష్టిస్థితిలయములు ఈశ్వరుని కర్మలగుచున్నవి. రజోగుణ సంబంధముచే సృష్టికర్తయగు బ్రహ్మయగును. సృష్టింపబడిన జగత్తును పరిపాలించుటకు సత్త్వగుణసంబంధముచే లక్ష్మీనాథుడగు విష్ణువగును. బహిర్గతమైన ప్రపంచమునులోనికిగొనుటకు, లయమును కల్గించుటకు ఆయనయే తమోగుణసంబంధముచే శివుడగును. ఈ సంహారక క్రియయు ఒక కరుణాకార్యమే. అజ్ఞానమున చిక్కిన ఆత్మలకు ప్రళయాంతమువరకు ఆయన విశ్రాంతి యొసగును. పునః సృష్టిలో వారు మరల సంచితకర్మలను అనుభవింతురు. ఈమూడుగుణములును నిజముగా ఈశ్వరునికి చెందినవి కావు. కాని ఈ మూడుకార్యములకై ఆయన యీ గుణస్పర్శ గావించును. ఆయన రూపములు వివిధములు కావచ్చును. కాని మూలతత్త్వమునందు భేదములేదు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూర్తిగా రజస్సత్త్వ తమోగుణములని చెప్పుటయు సరికాదు. విష్ణువు సత్త్వగుణ సంబంద్ధుడైనను నరసింహావతారమునను, రామావతారమున- ఖరదూషణ కుంభకర్ణ రావణాదులను చంపునపుడు తమోగుణమును తాల్చును, లంకకు దారి యీని సముద్రమును నిర్జలము చేయుదునని ఆయన శరసంధానము చేసినపుడును తమోగుణము స్ఫుటమగును. వాల్మీకి - 'క్రోధమాహారయత్‌ తీవ్రం' అని చెప్పును. క్రోధము తమోగుణలక్షణము. అటులనే శివుడు తమోగుణుడైనను నటరాజ, దక్షిణామూర్తి అవతారములయందు సాత్త్వికతను ప్రదర్శించును. నిర్గుణబ్రహ్మ యొక్క ఆహార్యమిశ్రసత్త్వము ఈశ్వరునికి కారణమగును. శుద్ధసత్త్వము - ఈశ్వరుని ఆహార్య మిశ్రరజోగుణము బ్రహ్మకును, ఆహార్యమిశ్ర సత్త్వగుణము విష్ణువునకును, ఆహార్యమిశ్ర తమోగుణము శివునికిని- కారణమగుచున్నది. అటులే విష్ణువుయొక్క ఆహార్య తమోగుణముచే నరసింహమూర్తిగను, శివునియొక్క ఆహార్య సత్త్వగుణముచే దక్షిణామూర్తిగను - రూపము లేర్పడినవి.

ఇట్లు ఏకదైవము అనేకమైనట్లు మనమతమును, మహా కవులును పల్కుదురు. ఇందు హెచ్చుతక్కువలను చూచుట. వివాదములు సల్పుట - పనిలేనివారికి విషయము. వస్తువ ఒక్కటి, రూపములు, నామములు వేరు కావచ్చును. కాని అంతిమసత్యమేమో ఒకటియే. ఈ విషయమునే మహాకవులు ఘోషించిరి. బృహదారణ్యకము, ఋగ్వేదము, యజర్వేదాంతర్గతమగు రుద్రాధ్యాయము ఈ సత్యమునే ఉద్ఘాటించును.


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page